సరదా కోసం ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి

  |   Telugunews

కొనకనమిట్ల, : సరదాగా చెక్‌డ్యామ్‌లో ఈతకొట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఇద్దరు యువకులు మృతిచెందిన సంఘటన మండలంలోని పెదారికట్ల గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. పెదారికట్ల గ్రామానికి చెందిన సోమురవి(26), మద్దూరి కొండారెడ్డి(20)లతో పాటు మరో ముగ్గురు యువకులు గ్రామానికి 4 కి.మీ దూరంలో కొండల మధ్య ఏర్పాటు చేసిన చెక్‌డ్యామ్‌ వద్దకు వెళ్లారు. ఇటీవల కురిసిన వర్షాలకు చెక్‌డ్యామ్‌ పూర్తిగా నీటితో నిండి ఉండడంతో సరదాగా చెక్‌డ్యామ్‌లోకి దిగారు. వీరికెవరికీ చెక్‌డ్యామ్‌ లోతు తెలియకపోవడం, ఈతసైతం రాకపోవడంతో ముగ్గురు యువకులు పక్కన ఉన్న చెట్లను పట్టుకుని బయటకు రాగా మిగిలిన ఇద్దరు చెక్‌డ్యామ్‌లో మునిగి మృత్యువాతపడ్డారు. తొలుత ఒకరినొకరు ప్రమాదం నుండి బయట పడేందుకు చేతులు పట్టుకోవడంతో లోతు నీటిలోకి వెళ్లి ఊపిరాడక మృతిచెందారు. చెక్‌డ్యామ్‌ నీటిలో నుండి బయటపడ్డ ముగ్గురు యువకులు గ్రామంలోకి వెళ్లి సమాచారం అందించారు. దీంతో మృతుల బంధువులు గ్రామస్థులు చెక్‌డ్యామ్‌ వద్దకు చేరుకుని నీటిలో మునిగి మృతిచెందిన రవి, కొండారెడ్డిలను బయటకు తీసి ట్రాక్టర్‌ ద్వారా ఇళ్లకు తరలించారు. మృతుడు సోము రవికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యనాగలక్ష్మి విలపించిన తీరు చూపరులను సైతం కన్నీరు పెట్టించింది. గతంలో మృతుడి అన్న నరేంద్ర విద్యుత్‌ షాక్‌కు గురై మరణించగా, ఇపుడు తమ్ముడు సైతం మరణించడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరో మృతుడు మద్దూరి కొండారెడ్డికి వివాహం కాలేదు.

ఫోటో - http://v.duta.us/itDrXAAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/5X_BfQAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬