కన్నుల పండువగా శ్రీ రామలింగేశ్వర స్వామి రథోత్సవం

  |   Telugunews

తర్లుపాడు, : మండలంలోని నాగెళ్ళముడుపు గ్రామంలో కొలువైయున్న శ్రీ పర్వతవర్థినీ సమేత రామలింగేశ్వర స్వామి దేవి నవరాత్రులలో భాగంగా మంగళవారం శ్రీ పర్వతవర్థిని సమేత రామలింగేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలు రథోత్సవంలో కొలువై కన్నులపండువగా ఉత్సవం సాగింది. స్వామి వారిని దర్శించుకొనేందుకు పలు ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. మంగళవారం ఉదయం 5గం.కు మంగళధ్వని, శ్రీమాత మేల్కొలుపు ఘంటావాదం, ఉదయం 6గం.కు శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి లఘున్యాస పూర్వక ఏకవారాభిషేకం, ఉదయం 7గం.కు శ్రీ పర్వత వర్థినీ అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన, మధ్యాహ్నం లలితాత్రిశతి, రాత్రి లలితా సహస్రనామ పూజలు, సాయంత్రం 4 గం.కు అమ్మవారు స్వామివారు రథోత్సవంలో కొలువై గ్రామ పురవీధులలో ఊరేగారు. అర్చకులు వంశపారంపర్య ధర్మకర్త కూనపులి శేషఫణిశర్మ, ప్రసాద్‌శర్మ, దేవులపల్లి పవన్‌కుమార్‌శర్మలు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. రెంటచింతల సుబ్రమణ్యంచే ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. నవరాత్రులలో ప్రతి రోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ అనంతపద్మనాభ స్వామికి, నవగ్రహాలకు శ్రీ లక్ష్మీపద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి, శ్రీ వల్లి దేవ సేనాసమేత శ్రీ సుబ్రమణ్యశ్వర స్వామికి, శ్రీ సువర్చలా సమేత ఆంజనేయ స్వామి వారికి శివకోటి కాశీవిశ్వేశ్వర స్వామి వారికి, శ్రీ హరిహరసుత శ్రీ అయ్యప్ప స్వామి వారికి అష్టోత్తర శతనామావలి పూజలను శేషఫణిశర్మ నిర్వహించారు. స్వామి వారి రథోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్ని ఓం నమ: శివాయ, నమ: శివాయ, శివాయ నమ: నామమును జపించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్‌ ప్రధానోపాధ్యాయులు కలువ బాలగురువారెడ్డి, తాడి చలమారెడ్డి, కందుల చిట్టిబాబు, జిల్లా వైసిపి కౌన్సిల్‌ సభ్యులు సూరెడ్డి రామసుబ్బారెడ్డి, మాజీ జడ్‌పిటిసి రావిభాషాపతిరెడ్డి, రాష్ట్ర రైతువిభాగం ప్రధాన కార్యదర్శి వెన్నా సత్యనారాయణరెడ్డి, పలు సంఖ్యలో ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ఫోటో - http://v.duta.us/8-53JQAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/dO8gXgAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬