[telangana] - రద్దయిన సెక్షన్‌ కింద కేసు పెడతారా?

  |   Telugunews

మైనంపల్లి ఒత్తిడితోనే నిర్బంధం.. రాష్ట్ర బీజేవైఎం నేత వ్యాజ్యం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు రద్దు చేసిన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్‌ 66 కింద తనను అక్రమంగా అరెస్టు చేసి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు పంపడాన్ని సవాలు చేస్తూ బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీఎం సాయిప్రసాద్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఇందుకు బాధ్యులైన ఒక్కొక్కరి నుంచి 5లక్షల చొప్పున పరిహారం ఇప్పించాలని కోర్టును కోరారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పి.నవీన్‌కుమార్‌ గురువారం దీన్ని విచారించారు. ప్రతివాదులుగా ఉన్న రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, రాచకొండ కమిషనర్‌, నేరేడ్‌మెట్‌ పోలీసుస్టేషన్‌ ఎస్‌హెచ్‌వో నరసింహ స్వామి, ఎస్‌ఐ జి.నరసింహా, తప్పుడు ఫిర్యాదు చేసిన సిరా రోహిత్‌, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, మల్కాజిగిరి మేజిస్ట్రేట్‌ బి. సౌజన్యలకు నోటీసులిచ్చారు.

2 వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని స్పష్టం చేశారు. పిటిషనర్‌ తరపు న్యాయవాది పి. శశికిరణ్‌ వాదించారు. ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సూచనల మేరకు తప్పుడు ఫిర్యాదుపై నేరేడ్‌మెట్‌ పోలీసులు జనవరి 15న కారణం చెప్పకుండా పిటిషనర్‌ను అరెస్టు చేశారన్నారు. ఆ సమయంలో పిటిషనర్‌ ఒక థియేటర్‌లో సినిమా చూస్తున్నారని తెలిపారు. ఏడేళ్లు అంతకన్నా తక్కువ శిక్షపడే కేసుల్లో పోలీసులు సీఆర్‌పీసీలోని సెక్షన్‌ 41(ఏ) కింద నోటీసు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ నిబంధనలు పాటించలేదన్నారు. ఎమ్మెల్యే ఒత్తిడితో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారన్నారు.

Photo - http://v.duta.us/Ze7DuwAA

Click here to read more— - http://v.duta.us/95wiBwAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬