తెలంగాణలో జనసేన పోటీ... పవన్ కళ్యాణ్ ప్లాన్ మారిందా ?🤭

  |   Telugunews

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న జనసేన... లోక్ సభ ఎన్నికల్లో మాత్రం కచ్చితంగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. తెలంగాణలోని లోక్ సభ నియోజకవర్గాలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కమిటీలను ప్రకటించడమే ఇందుకు సంకేతమని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేసేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయిలో సిద్ధమయ్యారు. అందులో భాగంగా మూడు లోక్ సభ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లతో పాటు కమిటీలను కూడా ప్రకటించారు.

సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, ఖమ్మం లోక్ సభ స్థానాలకు గురువారం కమిటీలను ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్... త్వరలోనే మరిన్ని లోక్ సభ నియోజకవర్గాలకు కమిటీలను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే మెదక్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, చేవేళ్ల, భువనగిరి, వరంగల్, నిజామాబాద్, నల్లగొండ లోక్ సభ నియోజకవర్గాలకు కూడా ఇదే తరహాలో కమిటీలను ప్రకటించేందుకు జనసేన సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

అయితే ఏ పార్టీతో పొత్తు అవగాహన లేకుండా ఎన్నికల బరిలోకి దిగాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్టు సమాచారం. ఏపీ తరహాలోనే తెలంగాణలోనూ పవన్ కళ్యాణ్ వామపక్షాలతో పొత్తు పెట్టుకుంటారా అనే చర్చ జరుగుతోంది. తెలంగాణలోని మూడు నాలుగు లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో సీపీఎం, సీపీఐలకు కొంతమేర పట్టు ఉండటంతో... ఆ స్థానాలను వామపక్షాలకు వదిలేసి... మిగతా స్థానాల్లో పోటీ చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై కూడా జనసేనలో చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా దూరంగా ఉన్న జనసేన... లోక్ సభ ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతుందన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.

పూర్తి ఆర్టికల్ ఇక్కడ చూడండి -http://v.duta.us/bwOM9wAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬