కదంతొక్కిన దండోరా కార్యకర్తలు

  |   Telugunews

.. డిమాండ్ల సాధన కోసం భారీ ర్యాలీ,ధర్నా

..డప్పుల మోత తో దద్దరిల్లిన మండల కేంద్రం

కరప, :తమ డిమాండ్ల సాధన కోసం ఎం ఆర్ పి ఎస్ కార్యకర్తలు సోమవారం కరపలో కదం తొక్కారు. డప్పుల మోత తో గ్రామాన్ని హోరెత్తించారు. నిరసన ర్యాలీ, ధర్నా నిర్వహించారు. మండల కేంద్రం కరప లో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు కొండేపూడి శ్యాoబాబు ఆధ్వర్యంలో మాదిగ, ఉపకులాల హక్కుల సాధన, డిమాండ్ల పరిష్కారం కోసం భారీ ర్యాలీ నిర్వహించారు. పి హెచ్ సి ఎదురుగా ఉన్న మాజీ ఉప ప్రధాని, దివంగత బాబూ జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి కరప గ్రామం అంతా తిరిగారు. ఎమ్మార్పీఎస్ జెండాలు ధరించి, డప్పు కొడుతూ తమ సమస్యలను ప్రజలందరికీ వివరించారు. అనంతరం తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు శ్యాంబాబు మాట్లాడుతూ మాదిగ కార్పొరేషన్, లిడ్ క్యాప్ సంస్థలకు మాదిగల నే చైర్మన్లు, డైరెక్టర్లుగా నియమించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా దేశంలోనూ, రాష్ట్రంలోనూ మాదిగ ఉపకులాల అభ్యున్నతి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చర్మ, డప్పు కళాకారులకు వెంటనే ఫించన్ లు మంజూరు చేయాలని ఆయన కోరారు. 50 సంవత్సరాలు దాటిన డప్పు కళాకారులకు రోజుకు రూ 150 వంతున నెలకు రూ 4,500 పింఛన్ ఇవ్వాలని సూచించారు. 40 సంవత్సరాలు దాటిన చెప్పులు కుట్టే చర్మకార వృత్తి దారులకు పింఛన్లు మంజూరు చేయాలని సూచించారు. ఇందుకోసం వెంటనే చర్మకార వృత్తి దారులు, డప్పు కళాకారుల నుంచి నూతన పింఛన్ల మంజూరుకు దరఖాస్తులు స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. బ్రిటీష్ కాలం నుంచి తమ కులస్తులు ప్రభుత్వ సమాచారాన్ని గ్రామాల్లో దండోరా వేస్తూ ప్రజలకు తెలియజేస్తున్నారన్నారు. 273 సంవత్సరాలుగా ఈ వ్యవస్థ నడుస్తోందన్నారు. అప్పట్లో బ్రిటిష్ పాలకులు మాదిగలకు మాన్యం భూములు ఇచ్చారని వెల్లడించారు. అయితే 1956లో ఓ చట్టాన్ని తెచ్చి అగ్రవర్ణాల వారు ఈ భూములు స్వాధీనం చేసుకుని, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం స్పందించి ఆర్ ఎస్ ఆర్ నకళ్ళలో ఉన్న భూములు గుర్తించి మాదిగల భూములు ఎవరి వద్ద ఉన్నప్పటికీ స్వాధీనం తీసుకుని తిరిగి తమకు అప్పగించాలని, దీని కోసం ఆందోళన చేపడతామని వెల్లడించారు. అదేవిధంగా ప్రభుత్వాలు నిరుపేద ఎస్సీలకు ముఖ్యంగా మాదిగలు, ఉప కులాల వారికి అసైన్డ్ ,ల్యాండ్ సీలింగ్ భూములు ఇచ్చారని గుర్తు చేశారు. కొందరు భూ బకాసురులు వారి వద్ద నుంచి ఈ భూములను లాక్కుని ఇప్పటికీ సాగు చేసుకుంటున్నారని అధికారులకు తెలిపారు. 1971 నాటి పి ఓ టి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి తమ కులస్తులకు ఇచ్చిన అసైన్డ్, ల్యాండ్ సీలింగ్ భూములను తిరిగి అప్పగించాలని సూచించారు. అనంతరం కరప మండల తాసిల్దార్ ఉదయ భాస్కర్ కు మెమోరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు మందపల్లి సత్యనారాయణ, గొడతా విజయ్ కుమార్, ఉందుర్తి ప్రకాష్ రావు, చాట్ర ఇమ్మానియేల్ ,దయానంద్ తదితరులు పాల్గొన్నారు.

ఫోటో - http://v.duta.us/K6Qb6QAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/6onXowAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬