సృజనాత్మక శక్తితో డ్వాక్రా గ్రూపులు ఆర్ధికంగా ఎదగాలి – ఎమ్మెల్యే మహీధర్‌ రెడ్డి

  |   Telugunews

కందుకూరు , : మహిళలు ఆర్ధిక స్వావలంబన సాధించి బలోపేతమైతే ఆ కుటుంబం ఆర్ధికంగా నిలదొక్కుకుంటుందని తద్వారా గ్రామాలు సైతం ఆర్ధికంగా పరిపుష్టతను సాధించుకుంటాయన్న లక్ష్యంతో డ్వాక్రా గ్రూపులను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని ఎమ్మెల్యే మహీధర్‌ రెడ్డి ఉద్భోదించారు. శనివారం సాయంత్రం వెలుగు కార్యాలయం ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. స్వయం సహాయక సంఘాలకు రూ.5 కోట్ల 76 లక్షల రుణాలను ఎమ్మెల్యే మహీధర్‌ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమంలో పంపిణీచేశారు. ఈ సందర్భంగా మహీధర్‌ రెడ్డి మాట్లాడుతూ డ్వాక్రా గ్రూపులు పనితీరు వల్ల ఒక విశ్వాసం, నమ్మకం బలపడిందని అన్నారు. బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలను సక్రమంగా తిరిగి చెల్లించడంలో డ్వాక్రా గ్రూపులు అమోఘంగా పనిచేస్తున్నాయని అన్నారు. అందువలన డ్వాక్రా గ్రూపులకు ఏ స్థాయిలోనైనా రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకులు ఎంతో నమ్మకంతో ముందుకు వస్తున్నాయని కొనియాడారు. అయితే డ్వాక్రా గ్రూపుల్లోని సభ్యులు తీసుకున్న రుణాలను కుటుంబ ఖర్చుల కోసం వినియోగించడం ఎక్కువగా జరుగుతున్నదని గుర్తుచేశారు. అందువలన ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరదని స్పష్టంచేశారు. మహిళలు తమలో ఉన్న సృజనాత్మకత శక్తిని వెలికితీయాలని కోరారు. అప్పుడు అద్భుతాలు సృష్టించవచ్చునని అన్నారు. రాష్ట్రంలోని గోదావరి జిల్లాల్లో నడుస్తున్న డ్వాక్రా గ్రూపులు అందరికీ స్పూర్తిగా నిలుస్తాయని అన్నారు. గోదావరి జిల్లాల్లోని స్వయం సహాయక సంఘాలు తయారుచేస్తున్న ఆహార ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండు ఉండడం గొప్ప విషయమని అన్నారు. ప్రత్యేకించి అక్కడి సంఘాలు తయారుచేసే తీపి ఆవకాయకు మంచి డిమాండ్‌ సృష్టించారని అన్నారు. అమెరికా, ఇంగ్లాండ్‌, అరబ్‌దేశాలు వంటి వాటికి ఎగుమతిచేసే స్తాయికి గోదావరి జిల్లాలోని డ్వాక్రా సంఘాలు ఎదిగాయని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్‌ను కలిగి ఉన్నారని, అంత డిమాండ్‌ సృష్టించారని శ్లాఘించారు. ఆ జిల్లాలోని డ్వాక్రా గ్రూపులను స్పూర్తిగా తీసుకొని మన ప్రాంతంలోని మహిళా సంఘాలు కూడా గొప్పగా ఎదగాలని ఆశాభావం వ్యక్తంచేశారు. ఉత్పాదక రంగం మీద దృష్టిపెడితే మహిళా సంఘాలు ఎంతో పురోభివృద్ధి సాధిస్తాయని అన్నారు. మహిళా సంఘాలకు అనుకూలమైన, ఇష్టమైన రంగాలను ఎంచుకొని ఆర్ధిక పరిపుష్టతన సాధించాలని అన్నారు. మహిళాశక్తిని గుర్తించిన ముఖ్యమంత్రి జగన్‌ రాష్ట్రంలోని అన్నీ ఉద్యోగాలలో, ఇతర రంగాలలో 50 శాతం రిజర్వేషన్‌ను కేటాయిస్తూ అసెంబ్లిdలో చట్టంచేశారని అన్నారు. మహిళల అభ్యున్నతి కోసం చిత్తశుద్ధితో వ్యవహరించిన గొప్ప ముఖ్యమంత్రి జగన్‌ అని కొనియాడారు. మహిళల కోసం పాటుపడిన జగన్‌ చిరస్మరణీయుడిగా నిలిచిపోతాడని అన్నారు. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకు ఇచ్చిన ఆర్ధిక సుస్థిరత ఆయా కుటుంబాలకు గొడుగువలే ఉపయోగపడుతుందని అన్నారు. అందుకోసమే డ్వాక్రా రుణాల బకాయిలన్నింటినీ ప్రభుత్వం విడతల వారీగా రద్దుచేస్తుందని ముఖ్యమంత్రి జగన్‌ హామీ ఇచ్చారని అన్నారు. వివిధ బ్యాంకుల ప్రతినిధులతోపాటు మండల తహశీల్దారు బిట్రా శ్రీనివాసరావు, ఎండిఓ విజయ్‌కుమార్‌తోపాటు వెలుగు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఫోటో - http://v.duta.us/xAivGwAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/Ivab7wAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬